సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జులై 2020 (15:07 IST)

శీతలపానీయంలో 'మత్తు' కలిపి నటిపై అత్యాచారం.. ఎక్కడ?

నిరక్ష్యరాస్యులే కాదు.. ఉన్న విద్యావంతులు సైతం క్షణికావేశానికి లోనవుతున్నారు. ఫలితంగా జీవితంలో క్షమించరాని తప్పులు చేస్తున్నారు. తాజాగా ఓ కంపెనీ సీఈవో... శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఓ నటిపై అత్యాచారం చేశారు. ఈ దారుణం బెంగుళూరులో జరిగింది. దీంతో ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు జేజే నగరులోని ఓ బహుళ అంతస్తు భవనంలో ఓ కన్నడ నటి నివాసం ఉంటోంది. 2018లో గాంధీబజార్‌ కాఫీడేకు వెళ్లిన సమయంలో నాయండహళ్లికి చెందిన మోహిత్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. 
 
తాను ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓనని చెప్పిన ఆ వ్యక్తి.. ఆ సినీ నటిని కంపెనీ ప్రచార రాయబారిగా నియమించుకున్నాడు. 2019 జనవరి 15వ తేదీన గోవాకు తీసుకెళ్లి ఫొటోషూట్‌ చేశాడు. కంపెనీలో ఆర్థిక సమస్యలంటూ రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. గత ఏడాది జూన్‌ 22వ తేదీన నటి ఇంట్లోనే తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. 
 
మరుసటి రోజు కూడా ఆ అతను నటితోనే ఉన్నాడు. ఆ సమయంలో వారిద్దరూ కలిసి భోజనం కూడా చేశారు. ఆ తర్వాత నటికి కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది తాగగానే నటి మత్తులోకి జారుకుంది. అంతే... ఆమెపై అతను లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. జూన్‌ 24న వీడియోను ఆమెకు చూపించి డబ్బు ఇవ్వాలని, లేకపోతే సోషల్ ‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించసాగాడు. 
 
దీంతో భయపడిపోయిన ఆ నటి... రూ.11 లక్షలు సమర్పించుకుంది. అనంతరం మళ్లీ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి రూ.9 లక్షలు లాగాడు. మరోసారి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలు తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మోహిత్, అతడి తండ్రి మహదేవ్, తల్లి నాగవేణి, రాహుల్‌ అనే వారిపై కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.