మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (14:51 IST)

రాష్ట్రపతి కంటే అంబులెన్సే ముఖ్యమన్న ట్రాఫిక్ ఎస్ఐ... దారి కోసం రాష్ట్రపతి కాన్వాయ్ నిలిపివేత!

బెంగుళూరు ట్రాఫిక్ ఎస్ఐ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. దీనికి కారణం ఆయన దేశ ప్రథమ పౌరుడి కాన్వాయ్‌ను నిలిపివేయడమే. అయితే, రాష్ట్రపతి వాహనశ్రేణికి బ్రేకులు వేయడం వెనుక ఓ నిజమైన కారణం లేకపోలే

బెంగుళూరు ట్రాఫిక్ ఎస్ఐ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. దీనికి కారణం ఆయన దేశ ప్రథమ పౌరుడి కాన్వాయ్‌ను నిలిపివేయడమే. అయితే, రాష్ట్రపతి వాహనశ్రేణికి బ్రేకులు వేయడం వెనుక ఓ నిజమైన కారణం లేకపోలేదు. అందుకే ఆ ట్రాఫిక్ ఎస్‌ఐకు ఐపీఎస్ అధికారుల నుంచి నెటిజన్ల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగుళూరు మెట్రో గ్రీన్ లేన్‌ను ప్రారంభించేందుకు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బెంగళూరు వచ్చారు. రాజ్‌భవన్ వైపు వెళుతున్న ఆయన కాన్వాయ్ నిత్యం రద్దీగా ఉండే ట్రినిటీ సర్కిల్‌ వద్దకు చేరుకోగానే... అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ ఎంఎల్ నిజలింగప్ప రాష్ట్రపతి కాన్వాయ్‌ను నిలిపివేశారు. సరిగ్గా అదేసమయంలో హెచ్ఏఎల్ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు వెళ్తున్న అంబులెన్స్‌ను గ‌మ‌నించిన ట్రాఫిక్ ఎస్ఐ ధైర్యం చేసి ఈ చ‌ర్య‌కు పూనుకున్నాడు. భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్ ఈజీగా వెళ్లేందుకు నిజ‌లింగ‌ప్ప మిగితా వాహ‌నాల‌కు దారిచూపాడు. తర్వాతే రాష్ట్రపతి కాన్వాయ్‌కి దారిచ్చారు. 
 
ఈ విషయం తెలుసుకున్న బెంగుళూరు పశ్చిమ విభాగం ట్రాఫిక్ డీసీపీ అభయ్ గోయల్... "భారత తొలిపౌరుడి కంటే ముందు అంబులెన్సుకు దారిచ్చినందుకు నిజలింగప్ప ప్రశంసలందుకున్నారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అంబులెన్సుకు దారిచ్చినట్టుగానే మీరు ఇస్తారా?’’ అంటూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై బెంగళూరు సీపీ ప్రవీణ్ సూద్ కూడా 'వెల్‌డన్' అంటూ రీట్వీట్ చేశారు. తర్వాత కొద్ది క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో నెటిజన్లు కూడా ఎస్ఐ నిజలింగప్పతో పాటు.. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు.