మంగళవారం, 25 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ దిక్సూచీ డీకే శివకుమార్

dkshivakumar
కర్ణాటకలో సంచలనం విజయం నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్లుగా ముందుండి నడిపించిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్. భారత్ జోడో యాత్ర నుంచి ఎన్నికల ప్రచారం దాకా ఆయన పాత్ర అసాధారణమనే చెప్పాలి. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూలదోసి.. 2019లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాలను ఆయన బాగా అందిపుచ్చుకున్నారు. 
 
బీజేపీ ప్రభుత్వంపై తదనదైనశైలిలో విమర్శలు గుప్పించడంలోనూ.. అవినీతిని ప్రశ్నించడంలోనూ ఇతర పార్టీల నేతలకంటే ముందున్నారు. ఆయన ఇంటిపై సీబీఐ దాడులు చేయడం.. కేసులు పెట్టడం.. వంటి పరిణామాలు తీవ్రసంచలనం సృష్టించింది. అయినా డీకే ఎక్కడా వెనక్కి తగ్గలేదు. భయపడలేదు. 
 
కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. లింగాయత్ సామాజిక వర్గం తర్వాత అంతటి బలమైన సామాజిక వర్గం వక్కలిగకు చెందిన డీకే.. ఆ సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీని చొచ్చుకుపోయేలా చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాగిన సమయంలో అన్నీ తానై వ్యవహరించారు. 
 
ముఖ్యంగా కర్ణాటకలో జోడో యాత్రను ఎన్నికలకు అన్వయించడంలోనూ డీకే సక్సెస్ అయ్యారు. అనేక క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడంలోనూ ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఏకంగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే గాంధీల కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, పార్టీలో ట్రబుల్ షూటర్ పేరు సంపాదించుకున్నారు. 
 
ఆటుపోట్ల విషయానికి వస్తే 2018లో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అదేవిధంగా పన్ను ఎగవేశారంటూ ఐటీ శాఖ అధికారులు డీకే ఇంటిపై దాడులు నిర్వహించారు. 2019, సెప్టెంబరు 3న మనీలాండరింగ్ చట్టం కింద డీకే అరెస్టయ్యారు. అనంతరం బెయిలుపై బయటకు వచ్చారు. తాజా ఎన్నికల్లో దాదాపు అంతా తానై వ్యవహరించిన డీకే ఇపుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.