ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2024 (17:07 IST)

భార్యను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసిన భర్త.. ఎక్కడున్నా సంతోషంగా వుండాలని..?

marriage
భార్య ఇంకో వ్యక్తిని ప్రేమించినా భర్త హుందాగా నడుచుకున్నాడు. భార్యను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాడు. ఈ ఘటన బీహార్‌లోని లఖిసరాయ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజేష్ కుమార్ (26) బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లా రామ్‌నగర్ గ్రామానికి చెందినవాడు. ఇతని భార్య ఖుష్బూ కుమారి (22). 2021లో వివాహం చేసుకున్న వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
 
 ఇక ఖుష్బూ కుమారి అదే గ్రామానికి చెందిన చందన్ కుమార్ (24)తో చాలా కాలంగా ప్రేమలో ఉంది. అయితే అంతకుముందే ఖుష్బూ తల్లిదండ్రులు తమ కుమార్తెకు రాజేష్ కుమార్‌తో వివాహం జరిపించారు. కానీ ఖుష్బూ కుమారి తన పాత ప్రేమను మరిచిపోలేక బాధపడుతూ వచ్చింది.
 
ఒక రాత్రి రాజేష్ లేని సమయంలో, చందన్ కుమార్ ఖుష్బూ ఇంటికి వచ్చాడు. అప్పుడు రాజేష్ కుమార్ సోదరులు ఖుష్బూ, చందన్ కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదనంతరం, మరుసటి రోజు ఉదయం ఖుష్బూ, చందన్ కుమార్‌లను పంచాయితీకి తీసుకువచ్చారు.
 
ఈ పంచాయతీలో భాగంగా అక్కడికి వచ్చిన ఆమె భర్త రాజేష్ కుమార్.. తన భార్యను ప్రేమించిన చందన్‌తో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అనంతరం ఇరువురి అంగీకారంతో అక్కడి ఆలయంలో వివాహం జరిగింది. దీంతో రాజేష్ తన రెండేళ్ల బాలుడిని తన వద్దే ఉంచుకుని భార్యను ప్రియుడితో సంతోషంగా పంపించాడు.
 
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ''వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలి. వారు ఎక్కడున్నా బాగుండాలి. నేను నా కొడుకుతో కలిసి జీవిస్తాను."అంటూ తెలిపాడు.
 
ఖుష్బూ కుమారి మాట్లాడుతూ.. "నా భర్త నన్ను ప్రేమికుడితో చూడగానే పెళ్లికి అంగీకరించాడు. ఆయనకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు, నేను నా కొత్త భర్తతో సంతోషంగా జీవిస్తాను." అంటూ వెల్లడించింది.