అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ఏర్పాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం, కిషోర్ బీహార్‌లో 'జన్ సూరజ్' పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు అనూహ్య స్పందన రావడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారు.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున కొత్త పార్టీని అధికారికంగా ప్రారంభిస్తామని కిషోర్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
పార్టీ నాయకత్వం, వర్కింగ్ కమిటీతో సహా మరిన్ని వివరాలు తరువాత తేదీలో వెల్లడి చేయబడతాయి.
ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా అనేక రాజకీయ పార్టీల ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ఆ తర్వాత జెడి(యు)లో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, కొన్ని పరిణామాలతో ఆయనను జేడీ(యూ) నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి కిషోర్ అవకాశం దొరికినప్పుడల్లా జెడి(యు) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.