బక్సర్ జిల్లాలో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్
బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి గౌహతికి బయలుదేరిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 60 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిని సహాయక సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
12506 నంబరు కలిగిన నార్త్ ఈస్ట్ రైలు ఢిల్లీ నుంచి గౌహతికి బుధవారం బయలుదేరింది. ఈ రైలు రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. పాట్నాలోని కీలక ఆస్పత్రులైన పట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నలంద మెడికల్ కాలేజ్ ఆఫ్ హాస్పిటల్, ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ వైద్యుులు, సిబ్బందిని అలెర్ట్‌గా ఉండాలని ఆదేశించింది. సహాయక చర్యల కోసం భారీ సంఖ్యలో అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి పంపించింది.
మరోవైపు, ఈ ప్రమాదంపై జిల్లా విపత్తు నిర్వహణ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి నిరంతరం టచ్‌లో ఉంటూ సహాయకర చర్యలను పర్యవేక్షించారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.