బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (15:33 IST)

370 ఆర్టికల్ రద్దు... ఉత్తుత్తి వాగ్దానమేనా?

ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టోలో అనేక అంశాలను ప్రస్తావిస్తాయి. హామీలు నెరవేరుస్తామని వాగ్దానం చేస్తాయి. అయితే వారు మాట నిలబెట్టుకుంటారా అనేది మాత్రం సందేహం. భాజపా కూడా ఇదే తరహాలో నడుచుకుంటోంది. ఎన్నికలలో పోటీ చేసేటప్పుడల్లా ఇచ్చిన వాగ్దానాలనే ఇస్తోంది. అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేయకపోవడం గమనార్హం. వారు మేనిఫెస్టోలో సాధారణంగా పొందుపరిచే జాతీయ వాద అంశం రామ మందిర నిర్మాణం. ఇది కొత్తదేమీ కాకపోయినా ఎన్నికల బరిలోకి దిగబోయే ప్రతిసారీ దీనిని పైకి తేవడం వారి నైజం. 
 
ఇప్పుడు కూడా అదే మాట చెబుతోంది. ఆ సంగతి ప్రక్కన పెడితే ఈ సారి ఆర్టికల్ 370 రద్దు అని కూడా తన మేనిఫెస్టోలో ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. జమ్మూ కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 గురించి బీజేపీ మేనిఫెస్టోలో ప్రస్తావించింది. అలాగే జమ్మూ కాశ్మీర్‌లో బయటి వాళ్లు ఆస్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం లేకుండా చేస్తున్న ఆర్టికల్ 35 ఏ ను కూడా రద్దు చేస్తామని కమలం పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. 
 
తద్వారా కాశ్మీర్ విషయంలో జాతీయవాదాన్ని రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఆర్టికల్ రద్దు విషయంలో బీజేపీ వాదన కొత్తది ఏమీ కాదు. ఆ ఆర్టికల్‌ను రద్దు చేయాలని గతంలో బీజేపీ డిమాండ్ చేసేది. అయితే గత ఐదేళ్లలో అధికారం చేతిలో ఉన్నా బీజేపీ ఆ పని చేయలేకపోయింది. పైపెచ్చు కాశ్మీర్‌లో ఆ ఆర్టికల్‌ను సమర్థించే వారితో కొన్నాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ ప్రస్తావన వివాదాంశంగా మారింది.