మేం అధికారంలోకి వచ్చాక 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తాం: జగన్

Last Updated: శనివారం, 6 ఏప్రియల్ 2019 (12:29 IST)
ఉగాది సందర్భంగా వైకాపా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. వైకాపా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతమున్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామని వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. 
 
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని తెలిపారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్, ఇప్పటికే జిల్లాల ఏర్పాటు, అందుకు సంబంధించిన విధి విధానాలపై చర్చించామని తెలిపారు. 
 
దేవుడి దయవల్ల, ఏపీ ప్రజల మద్దతుతో వైసీపీ అధికారంలోకి వస్తే, పరిపాలనను మరింత సులువుగా చేసేందుకు, సంక్షేమాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు జిల్లాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను ఓ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు.
 
కాంగ్రెస్ పార్టీని తాను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాననీ, వారిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని జగన్ స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదానే తమ తొలి ప్రాధాన్యమని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తాము మద్దతు ఇస్తామని జగన్ తెలిపారు.
 
మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఏపీ ప్రజలను మోసం చేశారని జగన్ విమర్శించారు. అందువల్లే వీరిద్దరినీ నమ్మే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాను దేవుడిని నమ్ముతాననీ, ప్రతీకారం అన్న విషయాన్ని ఆ దేవుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం 2010లో జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం వైసీపీని స్థాపించారు.దీనిపై మరింత చదవండి :