'ఉగాది' చుట్టే తిరుగుతున్న ఆంధ్ర రాజకీయం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఉగాది రోజుతోనే ముడిపడి ఉన్నట్లున్నాయి. ఈనెల 11వ తేదీన ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. వేసవిలో వచ్చిన ఈ ఎన్నికలు మరింత వేడిని పెంచుతున్నాయి. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపాలు ఎన్నిక తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయకపోవడం శోచనీయం.
ఎన్నికకు సరిగ్గా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పుటికే ఎన్నికల సమరంలో నువ్వా నేనా అంటూ నేతలు ప్రచారం సాగిస్తున్నారు. కానీ మేనిఫెస్టో మాత్రం ప్రకటించడం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోని ఇప్పటికే ప్రకటించాడు.
ప్రధాన పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో విడుదలను ఇప్పటివరకు ఆలస్యం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేతలు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అధికార పక్షం రేపు పంచాంగ శ్రవణం చేసిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రధాన ప్రతిపక్షం వైకాపా కూడా రేపే విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ రేపు తన ప్రచారానికి బ్రేక్ ఇవ్వనున్నాడు. అమరావతిలో నూతనంగా నిర్మించిన తన ఇంటిలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం చేయనున్నట్లు, అదే క్రమంలో అక్కడి నుండే మేనిఫెస్టోను విడుదల చేయనున్నాడట.
ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్న సమయంలో ఈ మధ్యలో వచ్చిన ఉగాది పర్వదినం వారికి కాస్త విశ్రాంతిని ఇచ్చినట్లుంది. 9వ తేదీతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుండడంతో మిగిలిన మూడు రోజులు పార్టీలకు కీలకం కానున్నాయి.