ఉగాది నాడు ఉగాది పచ్చడి తింటూ ఈ శ్లోకాన్ని పఠించాలట..లేకపోతే..?
తెలుగువారి నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన ‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’అన్న శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడి తినాలని మన శాస్త్రం చెబుతోంది.
మధుమాసంలో వచ్చే శోక బాధలను మన దగ్గరకు రాకుండా చేసేటటువంటి ఓ నింబ కుసుమమా, నన్ను ఎల్లప్పుడూ శోక రహితుడిగా (బాధలు లేకుండా) చెయ్యమని దేవుడిని కోరటమే ఆ శ్లోకానికి అర్థం. ఈ పండగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి. దీన్నే నింబకుసుమ భక్షణం, అశోక కళికాప్రాశనం అని కూడా అంటారు.
ఈ పచ్చడిని తయారు చేయడానికి కొత్త చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేపపువ్వు, మిరియాలు లేదా కారం లేదా పచ్చిమిర్చి, అరటిపండ్లు..మొదలైన పదార్థాలను ఉపయోగిస్తారు. ఇది షడ్రుచుల సమ్మేళనం.
తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులూ జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలనూ ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని చెప్పకనే చెబుతుందీ ఉగాది పచ్చడి.