శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (08:35 IST)

ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? - నేడు ఖరారు!

president bhavan
త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థిని ఆ కూటమి నేతలు మంగళవారం ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇందుకోసం గత కొన్ని రోజులుగా ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. దీంతో మంగళవారం ఎన్డీయే అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 
 
భాజపా పార్లమెంటరీ బోర్డు నేడు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలోనే రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠకు తెరదించే అవకాశముంది. మంగళవారం యోగా దినోత్సవం (జూన్‌ 21) దృష్ట్యా మైసూర్‌లో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రధాని మైసూర్‌ నుంచి వచ్చాక పార్లమెంటరీ బోర్డు భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
 
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 5 రోజుల క్రితం నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెల్సిందే. అయితే ఇప్పటివరకు అధికార, ప్రతిపక్ష కూటముల నుంచి రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. అధికార పక్షం తర్వాతే విపక్షాలు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం భాజపా కమిటీ వేసింది. జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయింది. అయితే విపక్షాలతో చర్చింది ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని ఈ కమిటీకి భాజపా అధిష్టానం సూచించింది. దీంతో పలువురు ప్రతిపక్ష నేతలతో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు.