శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (03:57 IST)

ఏఐడిఎమ్‌కె సెక్రటరీ ఎవరైతే మాకేంటి.. అది వాళ్ల ఖర్మ.. అనేసిన వెంకయ్య

భార్యాభర్తల పంచాయితీలో తలదూర్చడమంత మతి లేని పని మరొకటి లేదని తెలుగు గ్రామాల్లో వాడుకగా అంటుంటారు. దీన్ని తమిళనాడుకు వర్తిస్తే ద్రావిడ రాజకీయాల్లో తలదూర్చడమంత తెలివిమాలిన పని మరొకటి లేదు అని చెప్పాల్సి

భార్యాభర్తల పంచాయితీలో తలదూర్చడమంత మతి లేని పని మరొకటి లేదని తెలుగు గ్రామాల్లో వాడుకగా అంటుంటారు. దీన్ని తమిళనాడుకు వర్తిస్తే ద్రావిడ రాజకీయాల్లో తలదూర్చడమంత తెలివిమాలిన పని మరొకటి లేదు అని చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి, మన తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడికి తత్వం కాస్త ఆలస్యంగా బోధపడినట్లుంది. జయలలిత మృతి అనంతరం తమిళనాడు రాజకీయాల్లో పాగా వేయాలని శతథా ప్రయత్నించిన బేజీపీకి తల బొప్పి కట్టినట్లే ఉంది. అందుకే ఇక తన వల్ల కాదని అది చేతులెత్తేసినట్లుంది. ఏఐడీఎంకే సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా ఎవరుంటారనేది వాళ్ల అంతర్గత సమస్య. వాళ్ల సమస్యను వాళ్లే పరిష్కరించుకోనివ్వండి అంటూ  వెంకయ్యనాయుడు చల్లగా చెప్పేశారు. 
 
ఆదివారం పార్టీ ఎమ్మల్యేల భేటీలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం స్థానాన్ని శశికళ చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వార్తలు వెల్లువెత్తుతన్న నేపథ్యంలో అది వాళ్ల అంతర్గత సమస్య అంటూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అది ఏఐఎడిఎంకే అంతర్గత సమస్య. ఆ పార్టీ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా ఎవరుండాలి అనేది మనం నిర్ణయించలేం. వాళ్ల ఇంటి సమస్యను వాళ్లే పరిష్కరించుకోవనివ్వండి అంటూ కేంద్రమంత్రి స్పష్టం చేశారు. 
 
ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శిగా వి.కె శశికళ ఎన్నికకు వ్యతిరేకంగా ఆ పార్టీనుంచి బహిష్కృత నేత శశికళ పుష్ప చేసిన ఆరోపణపై అన్నాడీఎంకే ప్రతిస్పందనకోసం ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తున్న తరుణంలో శశికళను తమిళనాడు సీఎం పోస్టును కట్టబెట్టాలని చూస్తున్నట్లు వస్తున్న వార్తలపై మీడియా ప్రశ్నలకు వెంకయ్యనాయుడు సమాధానమిచ్చారు. ప్రధాన కార్యదర్శి పదవి విషయంలో వాళ్లు నిబంధనల ప్రకారం వ్యవహరించనట్లయితే, ఈసీ నోటీసుపై ఆ  పార్టీకి చెందినవారే ఒక నిర్ణయం తీసుకుంటారని మంత్రి సమాధానమిచ్చారు.
 
జయలలిత జీవించి ఉన్నప్పుడే ఆమె పన్నీరు సెల్వంని ముఖ్యమంత్రి పదవిలో నియమించారు. ఆమె ఆకస్మిక మృతి తర్వాత ఆయననే ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, సహకరిస్తామని కేంద్రం పన్నీరు సెల్వంకి స్పష్టం చేసింది. సాక్షాత్తూ ప్రధాని మోదీనే పన్నీర్ సెల్వంకి భరోసా ఇచ్చారు. కేంద్రం వైఖరిలో ఏ మార్పూలేదు అని వెంకయ్యనాయుడు తెలిపారు.
 
తమిళనాడు వ్యవహారాల్లో మోతాదుకు మించి వ్యవహరించి చేతులు కాల్చుకున్న వెంకయ్య, బీజేపీ ద్రావిడ పార్టీల మూలాలను ఇప్పటికైనా తెలుసుకున్నందుకు, వెంకయ్యకు తత్వం బోధపడినందుకు చాలా సంతోషం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇతరుల సొంత వ్యవహారాల్లో ఎన్నటికీ జోక్యం చేసుకోవద్దని, చేసుకుంటే ఇలాగే అవుతుందని వారు సూచిస్తున్నారు కూడా.