1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (06:52 IST)

తీహార్ జైలు నుంచే బిజినెస్.... అధికారుల్ని సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

యూనిటెక్ ఒకనాటి యజమానులు సంజయ్ చంద్ర, అజయ్ చంద్రలతో కుమ్మక్కయిన ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. వీరిద్దరూ జైలులో ఉంటూనే నిబంధనలను ఉల్లంఘిస్తూ, తమ వ్యాపారం చేసుకోవడానికి ఈ అధికారులు అనుమతిచ్చినందుకు ఈ చర్య తీసుకుంది.

వీరిద్దరినీ ఓ నెల క్రితం ముంబైలోని వేర్వేరు జైళ్ళకు పంపిన సంగతి తెలిసిందే. సంజయ్, అజయ్ ఇళ్ళ నిర్మాణం పేరుతో అనేక మంది నుంచి వేలాది కోట్ల రూపాయలను సేకరించారు. కానీ ఇళ్ళను నిర్మించడంలో విఫలమవడంతో వీరిద్దరినీ 2017లో అరెస్టు చేశారు.

మనీలాండరింగ్, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు నమోదు చేశారు. సంజయ్ చంద్ర భార్య ప్రీతి చంద్రను, ఆయన తండ్రి రమేశ్ చంద్రను ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. వీరు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కేసు నమోదు చేసింది. యూనిటెక్‌ను రమేశ్ చంద్ర (80) ఏర్పాటు చేశారు. 
 
సంజయ్, అజయ్‌లకు తీహార్ జైలులో అవినీతిపరులైన అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని సుప్రీంకోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. దీంతో వీరిద్దరినీ ముంబైలోని వేర్వేరు జైళ్ళకు తరలించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 
 
యూనిటెక్  దాదాపు 51 వేల మంది డిపాజిటర్లకు రూ.724 కోట్లు బాకీపడింది. ఈ సంస్థ మేనేజ్‌మెంట్ కంట్రోల్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి 2017లో అనుమతి లభించింది.