శనివారం, 18 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2024 (11:12 IST)

ఆప్ ఎంపీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా!

Cash for jobs scam
Cash for jobs scam
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌పై గోవా ముఖ్యమంత్రి భార్య సులక్షణ సావంత్ తేరుకోలేని షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు స్వీకరించిన కోర్టు.. సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీచేసింది. పైగా, జనవరి పదో తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 
 
గోవాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన కుంభకోణం వ్యవహారంపై ఇటీవల ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. సీఎం భార్య సులక్షణ సావంత్‌పై ఆరోపణలు చేశారు. దీంతో ఆమె నార్త్ గోవాలోని బిచోలిమ్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన అడ్ హక్ సివిల్ జడ్జి సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీ చేశారు.
 
తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు సంజయ్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని సీఎం ప్రమోద్ సావంత్ భార్య తన న్యాయవాదుల ద్వారా కోర్టును అభ్యర్ధించారు. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా బహిరంగ ప్రకటనలు చేయకుండా నిరోధించాలని ఆమె కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. సంజయ్‌ సింగ్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.