శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జనవరి 2021 (09:17 IST)

ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభం.. ఢిల్లీలో భారీ పోలీసు బందోబస్తు

Farmers Rally
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సింగు సరిహద్దుల నుంచి ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్లపై త్రివర్ణ పతాకాలను రెపరెపలాడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రాక్టర్లతో ర్యాలీకి తరలివచ్చారు. రైతులు ట్రాక్టర్లపై చిల్లా సరిహద్దుల మీదుగా ఢిల్లీ -నోయిడా లింకు రోడ్డులోకి ప్రవేశించారు. 
 
రైతుల ట్రాక్టర్ల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు కర్నాల్ బైపాస్ వద్ద రోడ్డును మూసివేస్తూ తాత్కాలికంగా గోడ నిర్మించారు. రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
ఢిల్లీలోని ఐటీవో, యమునా బ్రిడ్జి పలు ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ల ర్యాలీ టిక్రీ, సింగూ, ఘాజీపూర్ సరిహద్దుల మీదుగా వచ్చి కంజావాలా, బవానా, ఆచుండీ, కేఎంపీ వేల మీదుగా సింగూ సరిహద్దుకు తిరిగి వెళతాయని ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ దీపేంద్ర పాఠక్ చెప్పారు.
 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ల ర్యాలీకు 37 షరతులతో అనుమతి ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీకి అనుమతి ఉంది.. 5,000 ట్రాక్టర్లు, 5వేల మంది రైతులకు మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు.. అంబులెన్సులు, అత్యవసర వాహనాల కోసం ఒక లైన్ ( మార్గం) వదిలేయాని ఆదేశించారు. 
 
ఇక, అభ్యంతరకర పోస్టర్లు, బ్యానర్లు పట్టుకోరాదు, ప్రదర్శించరాదని షరుతులు విధించారు.. పేలుడు పదార్థాలు, ఆయుధాలు కలిగి ఉండరాదని స్పష్టం చేసిన పోలీసులు.. అనుమతించిన రూట్‌లో మాత్రమే ర్యాలీ నిర్వహించాలని పేర్కొన్నారు.. రోడ్లపై ధర్నాలు చేయడం గానీ.. బైఠాయించడం కానీ చేయకూడదనే షరతులు పెట్టారు.. ఇక, మార్గం మధ్యలో కొత్త ట్రాక్టర్లను చేర్చుకోరాదని స్పష్టం చేశారు.