శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (13:39 IST)

కొడుకు మరణిస్తే కోడలికి మరో పెళ్లి చేసిన అత్త... కాదు అమ్మ

ఈ రోజుల్లో అత్తాకోడళ్ళు పాముముంగిసలా ఉంటుంటారు. అత్తింటి వేధింపులకు అనేక మంది కోడళ్ళు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కానీ, ఆ అత్త మాత్రం తన కుమారుడు మరణించి పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ తన కోడలికి మరో పెళ్లి చేసి ఇతర అత్తలకు ఆదర్శంగా నిలించింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని హీరాపూర్‌ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన చంపాభాయి అనే మహిళకు చిన్నతనంలోనే వివాహమైంది. ఆ తర్వాత కుమారుడు పుట్టిన కొద్ది రోజులకే భర్తను కోల్పోయింది. దీంతో ఆమె మరో పెళ్లి చేసుకోకుండా తన కుమారుడే సర్వస్వం అనుకుని జీవించింది. చివరకు ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి ఓ జ్ఞానేశ్వరి అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది. అలా సాఫీగా సాగిపోతుందనుకున్న ఆమె జీవితం... మరోమారు విషాదంలోకి జారుకుంది. 
 
ప్రాణానికి ప్రాణమైన కుమారుడు హఠాత్తుగా మరణించాడు. దీంతో చంపాభాయి, జ్ఞానేశ్వరిలు మాత్రమే మిగిలారు. అయితే, చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన తాను పడిన కష్టాలను తన కోడలికి రాకూడదని భావించిన ఆ అత్త... కోడలిని మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీనికి ఆమె సమ్మతించలేదు. కానీ, తోడులేకుంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను వివరించిన అత్త... చివరకు రెండో పెళ్లికి కోడలిని ఒప్పించింది. తమ గ్రామానికి పక్క గ్రామంలో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడి తన కోడలు పెళ్లిని దగ్గరుండి జరిపించింది. దీంతో ఆమె జ్ఞానేశ్వరికి అత్త కాదనీ, అమ్మ అని అంటున్నారు.