సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (18:19 IST)

భారత్ మెరుపుదాడులపై స్పందించిన చైనా

జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ డిమాండ్‌కు ఎప్పటికప్పుడు మోకాలడ్డే... డ్రాగన్ తాజాగా భారత్ మెరుపుదాడులపై స్పందించింది. వివరాలలోకి వెళ్తే... పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ మంగళవారంనాడు పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై చైనా స్పందించింది. 
 
పాక్‌లోని అతిపెద్ద ఉగ్రవాద శిబిరమైన జైషేపై భారత్‌ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు మంగళవారం ఉదయం వేయి కేజీల బాంబులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కాగా, పుల్వామా దాడి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిపై చైనా వ్యాఖ్యానిస్తూ దాయాది దేశాలైన భారత్‌, పాక్‌లు రెండూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది.
 
భారత్‌ అంతర్జాతీయ సహకారం ద్వారా ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించాలని కోరిన చైనా, జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ డిమాండ్‌ను తోసిపుచ్చుతూనే తాజాగా మెరుపు దాడులపైనా తనదైన శైలిలో స్పందించింది. దక్షిణాసియాలో భారత్‌, పాకిస్తాన్‌ రెండూ కీలకమైన దేశాలనీ, ఇరుదేశాల మధ్య మెరుగైన సంబంధాలు దక్షిణాసియా ప్రాంతంలో పరస్పర సహకరానికి, ఈ ప్రాంతంలో శాంతి, సుస్ధిరతకు దారితీస్తాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కంగ్‌ పేర్కొన్నారు. భారత్‌, పాకిస్తాన్‌లు మరింత సంయమనంతో వ్యవహరిస్తూ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి పలు చర్యలు చేపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.