సినిమా థియేటర్ ప్రైవేటు ఆస్తి... బయట ఆహారానికి అనుమతి లేదు..
సినిమా థియేటర్ ఒక ప్రైవేటు ఆస్తి అని... ఆ థియేటర్ ప్రాంగణంలోని నియమనిబంధనలు ఆ థియేటర్ యజమాని ఇష్టమని సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. థియేటర్లలోకి బయటి నుంచి ప్రేక్షకులు తెచ్చుకునే ఆహార పదార్థాలను, పానీయాలను లోపలికి అనుమతించాలా? వద్దా? అనేది థియేటర్ యజమాని ఇష్టమని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే, పసిపిల్లల కోసం తల్లిదండ్రులు తెచ్చుకునే ఆహారాన్ని మాత్రం అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. గతంలో బయటి తినుబండారాలను అనుమతించాల్సిందేనంటూ 2018లో జమ్మూకాశ్మీర్ హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తన పరిధిని అధిగమించి ఈ తీర్పును ఇచ్చిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.
"సినిమా థియేటర్లు ప్రైవేటు ఆస్తులు. హాలు ప్రాంగణంలో పాటించాల్సిన నియమనిబంధనలను నిర్ణయించే హక్కు యజమానులకు ఉంటుంది. బయటి నుంచి ఎవరైనా సినిమా హాలులోకి జిలేబీ తెచ్చుకుంటే దానిని అడ్డుకునే హక్కు యజమానికి ఉంటుంది. జిలేబీ తిన్నాక ప్రేక్షకుడు తన చేతులను సీట్లకు తుడిచి పాడు చేస్తాడు. మరొకరు చికెన్ తెచ్చుకుంటారు. ఆ ఎముకలు అక్కడ పడేస్తారు. ఆ తర్వాత థియేటర్‌లో ఎముకలు ఉన్నాయంటూ కేసు పెడతారు'' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
అయితే ఆరోగ్యకరమైన తాగునీటిని థియేటర్‌లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని, పసి పిల్లల కోసం తల్లిదండ్రులు తెచ్చుకునే ఆహారాన్ని మాత్రం అనుమతించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.