సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (09:32 IST)

నిజమైన నిందితులకు శిక్ష ఎక్కడ? సుప్రీంకోర్టుకు అయేషా మీరా తల్లిదండ్రులు

ayesha meera
తమ కుమార్తె హత్య కేసులో నిజమైన నిందితులకు ఇప్పటివరకు శిక్ష పడలేదని తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మృతురాలు అయేషా మీరా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై విజయవాడలో "న్యాయంకై ఇంకెన్నాళ్లు'' అనే పేరుతో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తమ కుమార్తె హత్య కేసులో నిజమైన నిందితులను అరెస్టు చేయకపోగా మధ్యలో కొందరు అమాయకులను అరెస్టు చేసి అన్యాయంగా శిక్షించారని ఆరోపించారు. 
 
అయేషా హత్య కేసులో నిందితులకు శిక్షపడేదాకా పోరాటం చేస్తామన్నారు. ఈ విషయంలో తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదన్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. అసలైన దోషులకు శిక్షపడి న్యాయం జరిగే వరకు ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కేసును తప్పుదోవ పట్టించారని, 2018 డిసెంబరులో సీబీఐకు అప్పగించినప్పటికీ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదన్నారు. 
 
సీబీఐ దర్యాప్తులో భాగంగా తమను సికింద్రాబాద్ తీసుకెళ్లి డీఎన్ఏ పరీక్షలు కూడా చేశారని, తమ దగ్గరున్న వివరాలన్నీ సీబీఐకు అప్పగించామన్నారు. తమ మత పెద్దలు అయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టానికి అంగీకరించకపోయినా నాడు కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకున్నామన్నారు. కానీ, రీపోస్టుమార్టం చేసిన నాలుగేళ్ళయినా ఇంతవరకు దానికి సంబంధించిన నివేదిక రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.