1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 5 అక్టోబరు 2021 (21:18 IST)

చెన్నై నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం భూమి ఇచ్చేందుకు సీఎం స్టాలిన్ సిద్ధం

తిరుమలకు వచ్చే భక్తుల్లో అధికశాతం మంది తమిళనాడు రాష్ట్రం నుంచే వస్తుంటారు. సొంత వాహనాలే కాకుండా గోవింద నామస్మరణలు చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలా నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా టీటీడీ వసతి షెల్టర్లను కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది.
 
కానీ చాలామంది భక్తులు ఈ వసతి షెల్టర్లను సద్వినియోగం చేసుకోవడం లేదు. అయితే టీటీడీ ఉన్నతాధికారులు పాత స్థానంలో ఉన్న షెల్టర్ల వద్ద కొత్తవి ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఎక్కువసేపు నడుచుకుంటూ వస్తున్న భక్తులకు ఈ వసతి షెల్టర్లు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు టిటిడి ఛైర్మన్. 
 
ఇప్పటికే దీనికి సంబంధించి చెన్నై నగరంలో టిటిడి అధికారులతో చైర్మన్, ఇఓలు సమావేశమయ్యారు. చెన్నై నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నడచివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతి 20 నుంచి 30 కిలోమీటర్లు దూరానికి వసతి షెల్టర్లు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చెప్పారు.
    
అలాగే వచ్చే ఏడాది పెరటాసి మాసం ప్రారంభమయ్యే లోపు కాలినడకన వచ్చే భక్తుల సదుపాయం కోసం షెల్టర్లు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. చెన్నైలో నిర్మిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేసి కుంభాభిషేకం నిర్వహిస్తామని చైర్మన్ తెలిపారు.
 
తిరుమల తరహాలో చెన్నై నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఓఎంఆర్, ఈసిఆర్ ప్రాంతాల్లో భూమి ఇవ్వడానికి  తమిళనాడు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. టీటీడీ అందిస్తున్న ఉచిత వసతిని తమిళ భక్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.