చైనాను మించిపోయిన మహారాష్ట్ర.. 24 గంటల్లో 206 మంది మృతి
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,983 కేసులు నమోదు కాగా, 206 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం 2,56,611 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,25,381 ఉండగా, 1,24,094 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
ఇదిలా ఉండగా.. 7,135 మంది కరోనా వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 3007 పాజిటివ్ కేసులు నమోదవడంతో కరోనా పుట్టిళ్లు చైనాను వెనక్కి నెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం 85,975 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. చైనాలో ఇప్పటివరకు 83,036 కేసులు నమోదయ్యాయి. దీంతో చైనాకంటే ఎక్కువ కరోనా కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదవడం విశేషం.
31,667 కరోనా కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, 27,654 కేసులతో ఢిల్లీ, 20,700 పాజిటివ్ కేసులతో గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్ (9401), పశ్చిమబెంగాల్ (8187), కర్ణాటక (5452), బీహార్ (5088)లో ఐదువేలకు పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.