సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 మే 2021 (17:03 IST)

విమానంలో పెళ్లి చేసుకున్న చిక్కుల్లో పడిన జంట

ఓ జంట విమానంలో పెళ్లి చేసుకుని చిక్కుల్లో పడ్డారు. కరోనా నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన వారిపై ఫిర్యాదు చేయాల్సిందిగా వారు ప్రయాణించిన విమానయాన సంస్థను డీజీసీఏ ఆదేశించింది. 
 
తమిళనాడులో రాష్ట్రంలోని మదురైకు చెందిన ఓ జంట తాజాగా తమ పెళ్లిని వినూత్నంగా విమానంలో జరుపుకుంది. తమ పెళ్లిని చిరస్మరణీయంగా చేసుకునేందుకు ఖర్చుకు వెనుకాడకుండా ఈ ఏర్పాటు చేశారు. 
 
ఈ వివాహం కోసం ఏకంగా ఓ విమానాన్నే అద్దెకు తీసుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఆ విమానంలో మదురై నుంచి బెంగళూరు వెళుతూ గాల్లోనే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విమానం స్పైస్ జెట్ సంస్థకు చెందినది.
 
అయితే, కరోనా వేళ జరిగిన ఈ పెళ్లిలో కరోనా మార్గదర్శకాల అమలు ఎక్కడా కనిపించలేదు. విమానంలో అతిథులు కిక్కిరిసి ఉండగా, వధూవరులకు మాస్కుల్లేకుండానే మాంగల్యధారణ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
కరోనా నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏంటని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ స్పైస్ జెట్, ఎయిర్ పోర్ట్ వర్గాలను ఆదేశించింది. 
 
అలాగే, ఆ విమానంలోని స్పైస్ జెట్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది. ఈ స్పైస్ జెట్ చేసే ఫిర్యాదు ఆధారంగా డీజీసీఏ చర్యలు తీసుకోనుంది.