ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (08:46 IST)

అతి తీవ్ర తుఫానుగా యాస్.. నేడు తీరం దాటే ఛాన్సెస్..

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్‌ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది  మంగళవారం ఉదయం మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా, రాత్రికి అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది ఒడిశాలోని పారాదీప్‌కు 150, బాలాసోర్‌కు 250 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్‌లోని దిఘాకు 240, సాగర్‌దీవులకు 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 
 
బుధవారం తెల్లవారుజాముకు పూర్తిగా వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి బాలాసోర్‌కు దక్షిణాన దామ్రా ఓడరేవుకు అతి దగ్గరగా వెళ్లనుంది. తర్వాత ఉత్తర వాయువ్యంగా పయనించి బుధవారం మధ్యాహ్నం తర్వాత దామ్రా పోర్టుకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఆ సమయంలో గంటకు 155 నుంచి 165, అప్పుడప్పుడు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నానికే పశ్చిమ, తూర్పు, వాయువ్య బంగాళాఖాతంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అలాగే సముద్రం అల్లకల్లోలంగా మారింది. 
 
మరోవైపు, యాస్‌ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మంగళవారం అక్కడక్కడ వర్షాలు కురిశాయి. తీరం వెంబడి గంటకు 55 నుంచి 65, అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. కోస్తాలోని ప్రధాన ఓడరేవుల్లో రెండవ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 
 
కాగా, రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 45-55కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు,మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.