మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మే 2021 (10:37 IST)

తౌటే తర్వాత 'యాస్‌' తుఫాను వచ్చేస్తోంది, ఇది మల్లెపూవు తుఫాన్

పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో 'యాస్‌' తుఫాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది. 
 
సాయంత్రానికి ఇది పోర్ట్‌బ్లెయిర్‌కి ఉత్తర వాయువ్యదిశగా 590 కి.మీ, పారాదీప్‌కి దక్షిణ ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. 
 
ఆదివారం అర్థరాత్రికి తీవ్ర వాయుగుండమై, సోమవారం(మే 24,2021) మరింత బలపడి తుపానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు ప్రకటించారు.
 
ఈ నెల 26 సాయంత్రానికి ఇది ఉత్తర ఒడిశాలోని పారాదీప్‌, పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనికి 'యాస్‌' అనే పేరును ఒమన్‌ దేశం సూచించింది. అక్కడి భాషలో దీనికి మల్లె పువ్వు అని అర్థం. 
 
వాయుగుండం కారణంగా ఇప్పటికే అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25-27 మధ్య ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కింలోని పలు జిల్లాల్లో ఈ స్థాయిలో వర్షాలు కురవనున్నాయి.