Yaas storm ఉగ్రరూపం: బాలాసోర్ జిల్లాకు ఉప్పెన ముప్పు
యాస్ తుఫాన్ ఉగ్రరూపం దాల్చింది. ఉవ్వెత్తున సముద్రపుటలలు ఎగసిపడుతున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో ఒడిశా ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉన్న బాలాసోర్ జిల్లాకు రెస్క్యూ అండ్ రిలీఫ్ టీమ్‌ల బృందాన్ని తరలించింది. ఇక్కడ చాలా తీవ్రమైన తుఫాను యాస్ బుధవారం తీరం దాటే అవకాశం ఉంది.
యాస్ పెను తుఫాన్ తీరం దాటే సమయంలో 2 నుంచి 4.5 మీటర్ల ఎత్తులో సముద్రపుటలలు ఎగసిపడుతాయనీ, ఉప్పెన ప్రమాదం పొంచి వుందని IMD అంచనా వేసింది. అన్ని లోతట్టు ప్రాంతాలలో, తుఫాను-ఉప్పెన తాకిడి ప్రాంతాలలో వున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
తాము ఒకవైపు కోవిడ్ వైరసుతో పోరాడుతున్న సమయంలో, యాస్ తుఫాను రూపంలో మాకు మరో సవాలు వచ్చిందనీ, ప్రతి ప్రాణాన్ని కాపాడటమే ప్రాధాన్యత, తుఫాను పీడిత ప్రాంతాల్లోని వారందరినీ ఆశ్రయ గృహాలకు తరలించాలని, ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి పట్నాయక్ అన్నారు.
ఒడిశాలోని బాలసోర్, భద్రక్, కేంద్రపారా, జగస్తింగ్పూర్ జిల్లాలను మయూరభంజ్, కియోంఖర్ జిల్లాలను అధిక ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. మే 26-27 తేదీలలో అస్సాం, మేఘాలయ, సిక్కిం మూడు ఈశాన్య రాష్ట్రాలను యాస్ ప్రభావితం చేసే అవకాశం ఉందని IMD అధికారులు తెలిపారు.