1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (17:53 IST)

శాంతిస్తున్న కరోనా - వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత.. నైట్ కర్ఫ్యూ మాత్రం...

ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అన్ని సేవలను తిరిగి యధావిధిగా పునరుద్ధరించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా వారాతంపు రోజుల్లో అమలు చేస్తూ వచ్చిన కర్ఫ్యూ అమలును ఎత్తివేసింది. అయితే, రాత్రిపూట కర్ఫ్యూను మాత్రం యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. 
 
అదేసమయంలో మార్కెట్లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు వారాంతాల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చని, కానీ, 50 శాతం సామర్థ్యంతోనే నిర్వహించుకోవాలన్న నిబంధన విధించింది. అలాగే, వివాహాది శుభకార్యాలకు హాజరయ్యే వారి సంఖ్యను కూడా పెంచారు. గతంలో 20 మందికి మాత్రమే అనుమతి ఉండగా, ఇపుడు ఈ సంఖ్య 200కు చేరింది. అదేసమయంలో రాత్రి కర్ఫ్యూ మాత్రం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉండనుంది. 
 
ఢిల్లీ వ్యాప్తంగా రోజువారీ కోవిడ్ కేసుల్లో తగ్గుదల కనిపించడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేసమయంలో స్కూల్స్ వంటి విద్యా సంస్థలు మాత్రం మూసివేసివుంచుతారు. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కమిటి గురువారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది.