తండ్రికి 8 - తల్లికి 7 - చెల్లికి 4 కత్తిపోట్లు : ఢిల్లీలో కొలిక్కి వచ్చిన ట్రిపుల్ మర్డర్ కేసు
రాజధాని నగరం ఢిల్లీలో సంచలనం సృష్టించిన త్రిపుల్ మర్డర్ కేసు కొలిక్కి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో కొడుకే అసలు నిందితుడని తీర్మానించారు. పక్కా ప్రణాళికతో తన తల్లిదండ్రులని, సోదరిని దారుణంగా హతమార్చి ఏ పాపం తెలియనట్లు నాటకాలాడి అందరినీ నమ్మించాడు. పోలీసులు మొదట్లో అతడిని అనుమానించనప్పటికీ, నిందితుడి ప్రవర్తనలో తేడా రావడంతో అతడిని పిలిచి తమదైనశైలిలో విచారించారు. దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం, ఢిల్లీలోని వసంత్ కుంజ్ అనే ప్రాంతంలో మిథిలేష్ భార్య సియా, కూతురు నేహా, కుమారుడు సూరజ్‌లతో కలిసి ఉంటున్నాడు. కొన్ని రోజులుగా సూరజ్ కాలేజీకి వెళ్లకుండా స్నేహితులతో జులాయిగా తిరుగుతూ వచ్చాడు. కొడుకు తీరుతో విస్తుపోయిన మిథిలేష్ రెండు మూడుసార్లు హెచ్చరించాడు. కొడుకు పద్ధతి మార్చుకోకపోవడంతో మిథిలేష్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో సూరజ్‌పై చేయి చేసుకున్నాడు.
తండ్రి కొట్టడంతో పగ పెంచుకుని రగిలిపోయిన సూరజ్ అవకాశం కోసం ఎదురు చూశాడు. వేకువజామున గాఢనిద్రలో ఉన్న తండ్రి మిథిలేష్‌పై కత్తితో దాడి చేశాడు. గుండె, కడుపు భాగంలో 8 పోట్లు పొడిచాడు. తర్వాత మరో గదిలో నిద్రిస్తున్న తల్లి సియా వద్దకు వెళ్లి ఆమెను కత్తితో ఏడు పోట్లు పొడిచాడు. అనంతరం సోదరి నేహా గదిలోకి వెళ్లి ఆమెను నాలుగు పోట్లు పొడిచి ఇలా అందరినీ హత్య చేశాడు.
ఒక ప్లాన్ ప్రకారం తప్పించుకోవాలని, వేకువజామున 5.30 గం. సమయంలో ఇరుగుపొరుగువారిని అప్రమత్తం చేశాడు. ఎవరో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఇంట్లో ప్రవేశించి తన కుటుంబాన్ని హత్య చేసారంటూ కట్టు కథ అల్లాడు. అతని మాటలను ఇరుగు పొరుగు వారితో పాటు పోలీసులు కూడా నమ్మారు.
ఈ ముగ్గురు హత్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో మిథిలేష్ కుటుంబానికి ఎవరితోనూ వివాదాలు లేవని తెలుసుకుని, బుధవారం సాయంత్రం సూరజ్‌ని పిలిచి ప్రశ్నించారు. తండ్రి మిథిలేష్‌ని, విషయం తెలిసిపోతుందన్న భయంతో తల్లి, సోదరిని కూడా చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.