నీ ముఖం నాకు సరిగా కన్పించడం లేదు. హెల్మెట్ తీసేయి... ప్రియుడిపై యాసిడ్ దాడి
ఇటీవలి కాలంలో ప్రేమించలేదనో.. పెళ్లికి అంగీకరించలేదనో జరిగే దాడులు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, అమ్మాయిలను వేధించే పోకిరీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఓ యువతి ఓ యువకుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ప్రేమించలేదన్న కారణంతో ఈ దారుణానికి పాల్పడింది.
ఢిల్లీలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన యువతీయువకులు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో వారిద్దరూ సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ప్రియురాలు ఒత్తిడి చేస్తూ వచ్చింది. కానీ, అతను పెద్దగా పట్టించుకోకుండా, పెళ్లికి నిరాకరిస్తూ వచ్చాడు. పైగా, మనిద్దరం విడిపోదామని కోరాడు.
ఈ మాటలను ఆమె జీర్ణించుకోలేక పోయింది. పైగా, అతనిపై యాసిడ్ దాడి చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 11వ తేదీన ఇద్దరూ బైకుపై బయటకు వెళ్లారు. 'నీ ముఖం నాకు సరిగా కన్పించడం లేదు. హెల్మెట్ తీసేయి' అని ఆమె అడుగగా, హెల్మెట్ తీసి బైక్‌ను నడపడం ప్రారంభించాడా యువకుడు.
ఆ సమయంలో తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను అతనిపై చల్లింది. ఈ ఘటనలో అతనికి మెడ, గొంతు, ముఖంపై గాయాలు కాగా, యువతికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఇద్దరినీ ఆసుపత్రికి చేర్చి కేసు నమోదు విచారణ చేపట్టారు. పెళ్లికి నిరాకరించడం వల్లే ఈ పనికి పాల్పడినట్టు చెప్పడంతో ఆ యువతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.