శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (17:39 IST)

మోడీజీ.. పెద్ద నోట్లను రద్దు చేసి నా పెళ్లిని ఆపినందుకు థ్యాంక్స్ : ఢిల్లీ యువతి

సాధారణంగా ఒక యువతి జీవితంలో వచ్చే మధురమైన ఘట్టాల్లో వివాహం ఒకటి. అలాంటి వివాహాన్ని ఆపినందుకు ఓ యువతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపింది. సరైన సమయంలో పెద్ద నోట్లను రద్దు చేసిన నా పెళ్లిని

సాధారణంగా ఒక యువతి జీవితంలో వచ్చే మధురమైన ఘట్టాల్లో వివాహం ఒకటి. అలాంటి వివాహాన్ని ఆపినందుకు ఓ యువతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపింది. సరైన సమయంలో పెద్ద నోట్లను రద్దు చేసిన నా పెళ్లిని ఆపినందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఓ లేఖ కూడా రాసింది. ఇంతకీ ఆ యువతి పేరు కవిత. ఢిల్లీ వాసి. ఆమె ఆ విధంగా లేఖ ఎందుకు రాశారో పరిశీలిద్ధాం. 
 
ఢిల్లీకి చెందిన కవిత అనే యువతి లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తోంది. ఆమెకు 8 నెలల క్రితం ఓ ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించినట్టుగా వచ్చే నెల 9వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. అయితే పెద్ద నోట్లు రద్దు చేయాలన్న ప్రధాని మోడీ నిర్ణయం కారణంగా కవిత తండ్రి.. వరుడు కుటుంబానికి ఇస్తానన్న కట్నం ఇవ్వలేకపోయాడు. 
 
దీనికి కారణం.. తనకు ఇస్తానన్న కట్నం కొత్త నోట్లలోనే ఇవ్వాలని వరుడి కుటుంబం షరతు పెట్టింది. అయితే, కొత్త నోట్లు కావాలంటే.. కొంత సమయం కావాలని వధువు తండ్రి కోరడంతో పాటు.. ముందు వివాహ ఘట్టం పూర్తి చేయాలని కోరాడు. దీనికి వరుని కుటుంబం సమ్మతించలేదు. దాంతో పెళ్లి రద్దు అయింది. 
 
పెళ్లి రద్దు అయినందుకు ఆ యువతి బాధపడలేదు. పైగా.. డబ్బు కోసమే పెళ్లిచేసుకోవాలనే వ్యక్తికి తాను భార్య కాకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. అంతేనా... ప్రధాని తీసుకున్న నిర్ణయం తనకు మంచే చేసిందని కవిత ఆనందంతో చెప్పింది. అందుకు మోడీకి ధన్యవాదాలు కూడా చెప్పింది.