శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (12:37 IST)

కారం నీళ్ళతో ఆ అర్చకునికి అభిషేకం..! ఎక్కడ ఎందుకు?

అభిషేకం అంటే నీళ్ళతో చేస్తారు... పాలతో చేస్తారు.. పళ్ల రసాలతో, తేనెతో.. సుగంధద్రవ్యాలతో ఇలా రకరకాల పదార్థాలతో అభిషేకం చేస్తారు. కానీ కారంపొడితో అభిషేకం చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా.. వినకుంటే ఇప్పుడు మేం చెప్తున్నాం వినండి.. కారప్పొడితో కూడా అభిషేకం చేసే సాంప్రదాయాలు నేటి భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంతకీ ఎక్కడ ఏంటి అంటే కరుప్పు స్వామి ఆలయంలో వింత అభిషేకం.
 
అనాదిగా వస్తున్న సాంప్రదాయం తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఆడి అమావాస్య సందర్భంగా కరుప్పు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ధర్మపురి జిల్లా నల్లమ్‌పల్లిలో కరుప్పుస్వామి ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఉదయాన్నే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని అక్కడ జరిగే ఘట్టాన్ని ఆసక్తిగా తిలకిస్తారు. అర్చకుడు చెప్పే ఉపదేశాన్ని అందరూ శ్రద్ధగా వింటారు. ఇక ఆ తర్వాత అందరూ ఎదురు చూసే మహా ఘట్టం కొనసాగుతుంది. కరుప్పు స్వామి ఆలయంలో వింత అభిషేకం జరుగుతుంది. ఇక ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
 
కరుప్పు స్వామి అర్చకుడికి కారంనీళ్ళ అభిషేకం.. 75 కిలోల కారప్పొడితో అభిషేకం చేసిన ఆలయ సిబ్బంది 
ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే కారం కలిపిన నీళ్ళతో అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఇంతకీ అభిషేకం ఎవరికీ అంటే కరుప్పు స్వామి వారికి మాత్రం కాదు.. ఈ అభిషేకం స్వామివారిని నిత్యం పూజించే అర్చకునికి చేస్తారు. 
ప్రతి ఏడాది సాంప్రదాయంగా నిర్వహించే ఈ అభిషేక కార్యక్రమం ఈ ఏడాది కూడా నిర్వహించారు ఆలయ సిబ్బంది. ఈ అభిషేకం నిర్వహించడానికి 75 కిలోల ఎండుమిరపకాయలను వినియోగించారు. 
 
ఈ ఎండుమిరపకాయలను దంచి కారం పొడిగా చేసి ఆ కారం పొడిని నీటితో కలిపి భక్తులు అందరూ చూస్తుండగా బిందెల కొద్దీ కారపు నీళ్లను అభిషేకంగా ఆలయ అర్చకునికి పోసారు. మంట మండుతున్నా ప్రశాంతంగా కూర్చుని అభిషేకం చేయించుకున్న అర్చకుడు.. నేటికీ కొనసాగుతున్న వింత ఆచారం ఈ అభిషేకం నిర్వహించడంతో కరుప్పు ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా జరిగే ముఖ్యమైన ఘట్టం ముగుస్తుంది. 75 కిలోల కారం పొడి కలిపిన నీళ్ళతో అభిషేకం అంటే ఘాటు, మంట మామూలుగా ఉండదు. 
 
కానీ అర్చకుడు మాత్రం ఈ మిరపపొడి నీళ్ళ అభిషేకానికి ఎలాంటి చలనం లేకుండా కూర్చోవడం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం. మంట మండుతున్నా కరుప్పు స్వామి మీద ఉన్న భక్తిప్రపత్తులు ఆ శరీర భాదను సైతం పట్టకుండా చేస్తాయని చెప్పడం విశేషం. ఏదేమైనప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లోనూ, ఇంకా ఇలాంటి ఆచారాలు, వింత సంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయని చెప్పడానికి కరుప్పు స్వామి ఆలయంలో జరిగిన ఈ ఘటనే ఒక ఉదాహరణ.