మళ్ళీ పెరిగిన డిజల్ పెట్రోల్ ధరలు
రెండు రోజుల నిలకడ తదుపరి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు బలపడి రూ. 81.89కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్‌కు 24 పైసలు అధికమై రూ. 71.86ను తాకింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నాయి.
కాగా.. 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ మంగళవారం(24) వరకూ ఐదు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి.
ఈ బాటలో తాజాగా మరోసారి ధరలను పెంచాయి. దీంతో ఆరు రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు 83 పైసలు పెరిగింది. ఇక డీజిల్ ధర అయితే మరింత అధికంగా లీటర్ రూ. 1.40 ఎగసింది.
న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 45 డాలర్లను అధిగమించగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 48 డాలర్లకు చేరింది. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి.
విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే.