గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:36 IST)

త్వరలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు?

కొవిడ్‌-19 తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం అదనపు ఆదాయ మార్గాలను వెతుకుతోంది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచాలని ఆలోచిస్తోంది. కాగా ఈ పెరుగుదల లీటరుకు రూ.3 నుంచి 6 వరకు ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.
 
ఆర్థిక వ్యవస్థ కోలుకొనేందుకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీల నిర్వహణకు అదనపు వనరులు అవసరమౌతున్న నేపథ్యంలో.. వీటిని సమకూర్చుకునేందుకు ఇంధన ధరలను పెంచక తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. గత నెలరోజులుగా ఇంధనాలపై ఎక్సైజ్‌ సుంకం పెంచని నేపథ్యంలో ఇదే తగిన సమయమని నిపుణులు అంటున్నారు.

ఈ చర్య వల్ల సంవత్సరానికి రూ. 60,000 కోట్ల అదనపు ఆదాయం లభించగలదని అంచనా. కాగా, ఎక్సైజ్‌ సుంకం పెరుగుదలను గురించిన విధివిధానాలపై కేంద్రం కసరత్తులు ఇప్పటికే మొదలైనట్టు తెలిసింది. ఈ పెంపు నిర్ణయం ఎప్పుటి నుంచి అమలులోకి వచ్చేదీ త్వరలోనే ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
పెట్రో ఇంధనాలపై అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంది. ప్రస్తుత ధరలో సుమారు 70 శాతం పన్నులే అనే సంగతి తెలిసిందే. కాగా, ప్రతిపాదిత ఎక్సైజ్‌ సుంకం పెరుగుదలతో ఇది 75 నుంచి 80 శాతానికి కూడా చేరే అవకాశముందని పరిశీలకుల అంచనా. అయితే ఈ భారం రిటైల్‌ అమ్మకాలపై పడితే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురు కాగలదని పరిశీలకులు అంటున్నారు.