గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (19:22 IST)

ఎంచక్కా షాపింగ్ వెళ్లే శునకం.. మిగిలిన చిల్లరను జాగ్రత్తగా తెచ్చేస్తుందట!

Dog
విశ్వాసానికి శునకం మారుపేరు. అందుకే చాలా ఇళ్ళల్లో శునకాలను పెంచుకుంటారు. ఇకపోతే ట్రైనింగ్ ఇస్తే కుక్కలు ఎలాంటి పనులైనా చేయగలవు. ఇందుకు నిదర్శనం తమిళనాడుకి చెందిన జాక్ స్పారో అనే కుక్క. జాక్ స్పారో ఏం చేస్తుందో తెలుసా… ఎంచక్కా స్వయంగా తనే వెళ్లి షాపింగ్‌ చేస్తుంది. తన యజమానికి కావాల్సిన వస్తువులను ఒక్కటి కూడా పోగొట్టకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తుంది. అంతేకాదు మిగిలిన చిల్లరను జాగ్రత్తగా తెచ్చి అప్పజెబుతుంది. తమిళనాడులోని దిండిగుల్‌ జిల్లా పళనిలోని దాస్‌ ఫెర్నాండెజ్‌ పెంపుడు కుక్క పేరు జాక్‌ స్పారో.
 
నాలుగేళ్ల వయసు ఉండే ఈ లాబ్రడార్‌ జాతి కుక్కకు.. చిన్నప్పటి నుంచే దుకాణానికి వెళ్లి వస్తువులు తీసుకురావడాన్ని యజమాని అలవాటు చేశారు. దాస్‌ ఇచ్చిన చీటీతో దుకాణానికి వెళ్లి, అక్కడ వారిచ్చే వస్తువులను ఇంటికి తీసుకొస్తుంది. జాక్‌ స్పారో షాపింగ్‌ను స్థానికులంతా ఆసక్తిగా చూస్తుంటారు. ఔరా.. అని అవాక్కవుతున్నారు. మెడలో సంచితో జాక్ స్పారో చేసే షాపింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.