మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (17:23 IST)

ఆ మాస్టార్ కోసం స్కూలంతా ఏడ్చింది... ఎందుకని? ఎక్కడ?

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివిస్తే వారి భవిష్యత్ నాశనమైపోతుందన్న భావన ఇపుడు ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఈ విషయంలో కోటీశ్వరుడు - పేదవాడు అనే తేడా లేదు. అందుకే లక్షలాది రూపాయలు గుమ్మరించి ప

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివిస్తే వారి భవిష్యత్ నాశనమైపోతుందన్న భావన ఇపుడు ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఈ విషయంలో కోటీశ్వరుడు - పేదవాడు అనే తేడా లేదు. అందుకే లక్షలాది రూపాయలు గుమ్మరించి ప్రైవేటు పాఠశాలల్లో విద్యాభ్యాసం చేయిస్తుంటారు. కానీ, సర్కారీ బడుల్లో కూడా నూటికో కోటికో ఒక్కడుంటారు సరైన మాస్టార్. అలాంటి మాస్టర్‌కు బదిలీ ఉత్తర్వులు వస్తే ఆ స్కూలు పిల్లలంతా ఏడ్చేశారు. మా మాస్టర్ అత్యుత్తమ ఉపాధ్యాయుడు అంటూ ఆ బడి పిల్లలంతా ముక్తకంఠంతో చెపుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలోని వెళియగరమ్‌లో ప్రభుత్వ హైస్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో జి.భగవాన్ (28) ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ సబ్జెక్టును బోధిస్తాడు. పేరుకు పంతులే అయినా పిల్లలతో మాత్రం ఓ సీనియర్‌ విద్యార్థిగా, స్నేహితుడిగా నడుచుకునేవాడు. పాఠశాలకు వచ్చేది అందరూ పేద విద్యార్థులే కావడంతో ప్రతి ఒక్కరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉంటూ అనురాగం చూపించేవాడు. బడికి రాగానే పిల్లలను టిఫిన్ చేశారా అని అడిగేవాడు. ఎవరైనా లేదు సార్ అని సమాధానం చెబితే... వెంటనే తన డబ్బులతో ఆకలి తీర్చేవాడు. 
 
ఆకలితో చదువు ఎలా ఎక్కుతుంది అని సున్నితంగా మందలించేవాడు. చెప్పేది ఇంగ్లీష్ సబ్జెక్టు అయినా.. మిగతా క్లాసుల్లో పిల్లలకు వచ్చిన సందేహాలను కూడా నివృత్తి చేసేవాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ టీచర్‌గా కంటే.. ఇంట్లో పెద్దన్నగా వ్యవహరిస్తూ వచ్చాడు. పైగా, చదువుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటూ నిత్యం వారిలో ఉత్సాహం నింపుతూ వచ్చాడు. సాయంత్రం వేళల్లో ఆటలతో వారిని ఉత్తేజపరిచేవాడు. ఇలా అంతా హ్యాపీగా జరిగిపోతుంది అనుకున్న ఆ బడి పిల్లల చెవికి ఓ చెడువార్త వినిపించింది. 
 
అదే... భగవాన్ సార్‌కు బదిలీ. ఇక అంతే.. స్కూల్ మొత్తం భవవాన్ సార్‌ను చుట్టుముట్టింది. పెద్ద పెద్ద ఏడుపులు.. సార్ మీరు వెళ్లొద్దు అంటూ పెద్ద పెద్ద కేకలు. మీరు ఇక్కడే ఉండిపోండి సార్ అంటూ పిల్లలు ఆ టీచర్ కాళ్లపై పడ్డారు. కదలనీయకుండా అడ్డుకున్నారు. తమ చేతులతో బంధించారు. స్కూల్‌లో ఏడుపులు, కేకలతో ఏం జరుగుతుందో అని భయపడిన చుట్టుపక్కల వారు పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. అలా వచ్చిన వారికి అక్కడి సన్నివేశం చూసి ఆశ్చర్యపోయారు. ఆ పిల్లల ఆవేదన చూసిన తర్వాతగానీ భగవాన్ మాస్టర్ విలువ తెలియలేదంటున్నారు. 
 
పిల్లల ఆప్యాయత, అనురాగంపై టీచర్ స్పందిస్తూ, '2014లో మొదటిసారి నాకు ఈ స్కూల్‌లోనే పోస్టింగ్ వచ్చింది. పిల్లల దగ్గర ఎప్పుడు టీచర్ అని కాకుండా.. వారిలో సీనియర్‌గా బిహేవ్ చేశాను. నేను చేయాల్సిన డ్యూటీ ఇది.. ఇందులో వింత ఏమీ లేదు. నేను కూడా పేద కుటుంబం నుంచే వచ్చాను. ఆ కష్టాలు నాకు తెలుసు. అందుకే చదువుకోమని మరీమరీ చెబుతుండేవాడినంటూ భగవాన్ వెల్లడించారు. 
 
అయితే, ఆ టీచర్ కోసం విద్యార్థులు బోరున విలపించిన వార్త తమిళనాడు వ్యాప్తంగా భగవాన్ సార్ ఫోటోతో సహా వైరల్ అయింది. దీంతో విద్యాశాఖ దిగి వచ్చింది. ఆ మాస్టారి బదిలీ ఉత్తర్వులను 10 రోజుల పాటు నిలిపివేసింది. ఈ గడువు ముగిసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆ స్కూల్ పిల్లలు మాత్రం మాస్టారును బదిలీ చేస్తే స్కూల్‌కు వచ్చేది లేదని ఇప్పటికే అల్టిమేటం కూడా ఇచ్చారు.. ఇలాంటి మాస్టారు ఏ నూటికో.. కోటికో ఒక్కరుంటారు. హ్యాట్సాఫ్ భగవాన్ మాస్టారు.