ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (17:37 IST)

చెప్పులు లేనివాళ్లు కూడా రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెడుతున్నారు : అమిత్ షా

గతంలో సిఫార్సులు ఉన్నవారికి మాత్రమే పద్మ పురస్కారాలు దక్కేవని, ఇపుడు ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులు ఇస్తుండటంతో కాళ్లకు చెప్పులు లేని వారు కూడా రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టి పద్మ అవార్డులను అందుకుంటున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన హోం మంత్రి.. నెల్లూరులో జరుగుతున్న స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, 'గతంలో సిఫార్సుల మేరకే పద్మ పురస్కారాలు దక్కేవి. ప్రస్తుతం ప్రతిభ ఆధారంగానే అవార్డులు ఇస్తున్నాం. కాళ్లకు చెప్పులు లేని సామాన్యులు కూడా రాష్ట్రపతి భవన్‌కు వచ్చి అవార్డులు తీసుకున్నారు. ప్రతిభ, సేవతోనే పురస్కారాలు అందుకున్నారు' అని చెప్పారు. 
 
ఆ తర్వాత నెల్లూరు జిల్లాతో పాటు.. దేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన సేవలపై మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే వెంకయ్య నాయకుడిగా ఉన్నారన్నారు. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎదిగిన ఆయన.. జయప్రకాశ్‌ నారాయణ స్ఫూర్తితో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.
 
జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంకయ్య నాయుడు.. నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ కాలంలో ఎన్నో ఉన్నత స్థాయి చర్చల్లో చురుకుగా పాల్గొన్నారని కితాబిచ్చారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే వెంకయ్య.. మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖనే ఎంచుకున్నారని చెప్పారు. 
 
రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని వెంకయ్యనాయుడు పరితపిస్తుంటారని అన్నారు. నిత్యం ప్రజా సంక్షేమం గురించే ఆలోచించే వెంకయ్య కేంద్రమంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులు చేపట్టారని, ఆ పదవులకే ఆయన వన్నె తెచ్చారని కీర్తించారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వెంకయ్య చేసిన కృషిని కొనియాడారు. 
 
వెంకయ్య ఏ కార్యక్రమం చేపట్టినా.. రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థుల కోసమే ఆలోచించేవారని అన్నారు. 370 అర్టికల్ బిల్లు ఆమోదంలో వెంకయ్యనాయుడు కీలకపాత్ర పోషించారన్న అమిత్ షా.. బిల్లు ఆమోదం సమయంలో రాజ్యసభలో ఎదురైన ఆందోళనలను సమర్థంగా ఎదుర్కొన్నారని చెప్పారు. ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోవద్దనే మాటకు నిదర్శనం వెంకయ్య అని హోం మంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు.