ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (18:40 IST)

ఏపీలో అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇలా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేడు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 7.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో బస చేస్తారు. ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లాలోని వెంకటాచలానికి పయనమవుతారు.

అక్కడ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు సంబంధించిన స్వర్ణభారతి ట్రస్టు 20వ వార్షికోత్సవం, ముప్పవరపు ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం వేళ 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్‌ హోటల్‌కు చేరుకుంటారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. సమావేశం ముగిసిన అనంతరం ఆదివారం రాత్రి తాజ్‌ హోటల్‌లోనే అమిత్‌ షా బస చేయనున్నారు. సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం వేళ 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.40కు ఢిల్లీ చేరుకుంటారని అధికారులు తలెఇపారు.

దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం కోసం ఏపీకి వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం వైఎస్‌ జగన్ స్వయంగా స్వాగతం పలకనున్నారు. ఈ కౌన్సిల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ రాష్ట్రాల అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పకడ్బంధీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.