బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2025 (09:05 IST)

నేపాల్‌లో భారీ భూకంపం - భారత్ కూడా ప్రకంపనలు (Video)

earthquake
నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. నేపాల్ - టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇది  రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం కనిపించింది. ముఖ్యంగా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. 
 
మంగళవారం ఉదయం ఇక్కడ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తు కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లిందన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కార్మాండూ సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
 
ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ - ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. అటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. నేపాల్లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015 ఏప్రిల్లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.