శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (12:42 IST)

'మహా' గెలుపు : ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శివసేన

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని బీజేపీ - శివసేన కూటమి విజయందిశగా దూసుకెళుతోంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కూటమి 158 సీట్లలో ఆధిక్యంల ఉంది. అలాగే, కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి 93 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇతరులు 23 చోట్ల, ఎంఐఎం మూడు చోట్ల ముందంజలో ఉన్నారు. 
 
అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గతంలో కంటే తక్కువ సీట్లు గెలుచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని శివసేన నేతలు భావిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి పీఠాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీని కోరనున్నట్లు శివసేన స్పష్టం చేసింది.
 
వర్లి నుంచి పోటీ చేసిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని కోరతామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, 'నేను మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కావడానికి వెళ్తున్నాను. బీజేపీతో మా మిత్రత్వం కొనసాగుతుంది. ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరతాం. 50-50 ఫార్ములా అమలు చేయాలి' అని వ్యాఖ్యానించారు.
 
ఇరు పార్టీల నేతలు రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రిగా కొనసాగాలని శివసేన భావిస్తోంది. అయితే, శివసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మాత్రం స్పందించడంలేదు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తుది ఫలితాలు వెల్లడయ్యేంత వరకు వేచిచూడాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్టు సమాచారం.