మావోయిస్టులతో సంబంధాలు: ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు(47) జీవిత ఖైదు విధిస్తూ మహారాష్ట్రల్లోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. మరో నలుగురికి జీవిత ఖైదు విధించగా, మరొకరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు(47) జీవిత ఖైదు విధిస్తూ మహారాష్ట్రల్లోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. మరో నలుగురికి జీవిత ఖైదు విధించగా, మరొకరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీ వర్సిటీ ఇంగ్లిషు ప్రొఫెసర్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ మే, 2014లో గడ్చిరోలి పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మావోయిస్టులకు సంబంధించిన పత్రాలు, సీడీలు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించారు. దాంతో వర్సిటీ సాయిబాబాను సస్పెండ్ చేసింది.
విధ్వంసం సృష్టించేందుకు, సమాజంలో అశాంతి రగిల్చేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల విరోధభావం వ్యాప్తి చేసేందుకు నిందితుడు కుట్ర పన్నాడని తీర్పు సందర్భంగా గడ్చిరోలి కోర్టు పేర్కొంది. అందుకు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నక్సల్స్ సాహిత్యమే సాక్ష్యమని, ఆ సాహిత్యాన్ని మావోయిస్టులు, ఆర్‌డీఎఫ్(రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్)తో పాటు ఇతరులకు సాయిబాబా అందచేశారని న్యాయమూర్తి షిండే తీర్పులో పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద సాయిబాబా, అతని సహచరుల్ని దోషులుగా కోర్టు నిర్ధారించింది.
సాయిబాబాతో పాటు వర్సిటీ విద్యార్థి హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్‌రాయ్‌తో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. అనారోగ్య కారణాలతో సాయిబాబాపై కనికరం చూపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మే, 2014లో సాయిబాబా అరెస్టు అనంతరం అతని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మే, 2015లో బోంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం మళ్లీ జైలు కెళ్లడంతో బెయిల్ కోసం సాయిబాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 2016లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవకుండా మినహాయింపునిచ్చింది.
సుప్రీం తీర్పునకు విరుద్ధం వరవరరావు
మావోలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని విరసం నేత వరవరరావు అన్నారు. నిషేధిత పార్టీతో సంబంధం ఉండడం లేదా ఆ పార్టీ రాజకీయ విశ్వాసం కలిగి ఉండడం, చివరకు ఆ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడం వాటికవిగా శిక్షార్హమైనవి కావని సుప్రీంకోర్టు ఇటీవలే ఓ కేసులో తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
-----------------------------------------