ఉద్ధవ్ ఠాక్రేను అపహాస్యం చేస్తూ గీసిన కార్టూన్.. శివసేన కార్యకర్తల దాడి
శివసేనతో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గుర్రుగా వుంది. మహారాష్ట్రపై ఆమె చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ఇంకా ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో కంగన.. శివసేనకు మధ్య పెద్ద వార్ జరుగుతోంది.
మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను అపహాస్యం చేస్తూ గీసిన కార్టూన్‌ను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన ఓ నేవీ రిటైర్డ్ అధికారిపై అధికార పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై తనకు వచ్చిన కార్టూన్‌ను నేవీ రిటైర్డ్ అధికారి మదన్ శర్మ (65) వాట్సప్‌లో ఫార్వర్డ్ చేశారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి ముంబైలోని అతని ఇంటికి వెళ్లిన నలుగురు శివసేన కార్యకర్తలు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన కన్నుకు తీవ్రంగా గాయమైంది.
తనకు వచ్చిన ఓ కార్టూన్‌ను తానుంటున్న రెసిడెన్షియల్ సొసైటీ వాట్సప్ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేశానని శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం తనకు కమలేష్ కదమ్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని, అతడు తన పేరు, అడ్రస్ అడిగాడని పేర్కొన్నారు. తర్వాత గుంపుగా వచ్చి తనపై దాడికి పాల్పడ్డాడని వెల్లడించారు. దీంతో నలుగురు శివసేన కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు, వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
ఈ సంఘటను మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. రాష్ట్రంలో గూండాల పాలన సాగుతున్నదని విమర్శించారు.