సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (19:14 IST)

మిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే.. ఏమనుకుంటున్నావ్... రేపు మీ అహంకారం కూలిపోతుంది...

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే... ఈ రోజు నా ఇల్లు కూల్చివేశారు.. రేపు.. మీ అహంకారం కూలిపోతుందంటూ మండిపడ్డారు. 
 
ముంబై బాంద్రాలో కంగనా రనౌత్‌కు బంగ్లా ఉంది. ఇందులో అక్ర‌మంగా మార్పులు జ‌రిగిన‌ట్లు బీఎంసీ అధికారులు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఇంటికి మంగళవారం నోటీసులు అంటించి, బుధవారం మ‌ధ్యాహ్నం 12.30 నిమిషాల‌కు కంగ‌నా ఆఫీసుకు వెళ్లిన బీఎంసీ అధికారులు బుల్డోజ‌ర్ల‌తో ఆ భవనంలో అక్రమంగా మార్పులు చేర్పులు చేసిన ప్రాంతాన్ని కూల్చివేశారు. 
 
దీనిపై కంగనా రనౌత్ మండిపడ్డారు. "ఉద్ధవ్ థాకరే... ఏమనుకుంటున్నావ్?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "సినీ మాఫియాతో చేతులు కలిపి నా ఇల్లు కూల్చేసి నాపై ప్రతీకారం తీర్చుకున్నారా? ఇవాళ నా ఇల్లు కూలిపోయింది... రేపు మీ అహంకారం కూలిపోతుంది" అంటూ నిప్పులు చెరిగారు.
 
"మనం కాలచక్రంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి. అది ఎప్పటికీ ఒకచోట ఆగదు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం వెలువరించారు. "ఇలాగైనా మీరు నాకో మేలు చేశారు. కాశ్మీరీ పండిట్లు ఎందుకు బాధలు పడుతున్నారో అర్థమైంది. ఇవాళ అది నాకు అనుభవంలోకి వచ్చింది. ఇవాళ దేశానికో మాటిస్తున్నాను... అయోధ్య మీదనే కాదు కాశ్మీరీలపైనా సినిమా తీస్తాను" అంటూ కంగనా ప్రతిజ్ఞ చేశారు.