గురువారం, 21 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (09:18 IST)

అధికారం కోసం 'శివసేన'ను 'సోనియాసేన'గా మార్చేశారు.. కంగనా పంచ్ డైలాగులు

మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మీ పార్టీ పేరును శివసేన నుంచి సోనియా సేనగా మార్చుకోవాలంటూ సూచించారు. 
 
సుశాంత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసు దర్యాప్తుపై నమ్మకం లేదనీ, ముంబై మహానగరం కాస్త పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా మారిపోయిందంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదానికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలతో ప్రతీకారేచ్ఛతో రగిలిగిపోయిన శివసేన... బాంద్రాలోని కంగనా రనౌత్ సినిమా కార్యాలయాన్ని కూల్చివేయించింది. 
 
ఈ చర్యపై కంగనా రనౌత్ మండిపడింది. 'మీ తండ్రిగారి మంచి పనులు మీకు సంపదను ఇస్తాయేమో.. మంచి పేరును మాత్రం మీరే సంపాదించుకోవాలి. మీరు నా గొంతు నొక్కితే.. కోట్లాది గొంతుకలుగా అది ప్రతిధ్వనిస్తుంది. మీరు ఎన్ని నోళ్లు మూయగలరు? ఎంతమందిని అణిచివేయగలరు? నిజాలకు దూరంగా పారిపోయే మీరు రాచరిక పాలనకు సరైన ఉదాహరణ. అధికారం కోసం శివసేనను సోనియా సేనగా మార్చేశారు. నా వెంట నిలుస్తున్న కోట్లాది మందికి నా ధన్యవాదాలు. ఎంతోమంది మరాఠీ స్నేహితులు నాకు ఫోన్‌ చేసి మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. మహారాష్ట్ర సంస్కృతిని ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యలతో మంట కలపొద్దు' అని కంగన మండిపడ్డారు. 
 
మహారాష్ట్ర సర్కారుపై కంగనా పోరాటం ఒకప్పటి భగత్‌ సింగ్‌ను గుర్తు చేస్తోందని తమిళ నటుడు విశాల్‌ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. కంగనాతో వివాదం అనేది అధ్యాయం ముగిసినట్లు భావిస్తున్నామని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు.