గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (19:30 IST)

కంగనా హత్యకు గురికావొచ్చు - మణికర్ణికపై కేసు నమోదు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హత్యకు గురికావొచ్చంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జర్ అనుమానం వ్యక్తంచేశారు. ఇదే అంశంపై ఆయన కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఆమె శత్రువులు హత్య చేసే అవకాశం ఉందన్నారు. అలాగే, తనను కూడా దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ హతమార్చవచ్చని, అందువల్ల తనకు రక్షణ కల్పించాలంటూ ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
అమిత్ షాకు రాసిన లేఖలో, తనకు ముంబై దాడుల సూత్రధారి దావూద్ ఇబ్రహీం, ఆయన నేతృత్వంలోని డీ-కంపెనీల నుంచి ప్రాణభయం ఉందని నంద కిశోర్ గుర్జర్ తెలిపారు. ఒకటిన్నర నెలల నుంచి తనకు విదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయని, తనను చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ బెదిరింపు ఫోన్ల వెనుక దావూద్ ఇబ్రహీం, డీ-కంపెనీ ఉన్నట్లు తాను విశ్వసిస్తున్నానన్నారు. 
 
అదేవిధంగా కంగనా రనౌత్‌ను కూడా ఆమె ప్రత్యర్థులు హత్య చేసే అవకాశం ఉందన్నారు. 'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్‌ను నిషేధించాలని తాను కోరానని కూడా ఆయన అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ వెబ్ సిరీస్‌లో తనను చట్టవిరుద్ధంగా చూపించారన్నారు. సనాతన ధర్మం గురించి కూడా చెడుగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ సిరీస్ నిర్మాణం వెనుక కూడా డీ-కంపెనీ ఉందన్నారు.
 
ఇదిలావుంటే, కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై చేసిన వ్యాఖ్యలకు నటి కంగనా రనౌత్‌పై ముంబైలోని విఖ్రోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బుధవారం నటి కంగనా రనౌత్ .. ఠాక్రే కోసం ఒక వీడియో సందేశాన్ని షేర్ చేశారు. అందులో ఆమె అతన్ని "తుజే" అని సంబోధిస్తూ, ఈ రోజు తన ఇల్లు కూల్చివేయబడిందని, మీ అహంకారం రేపు విరిగిపోతుందని కంగనా అన్నారు. బీఎంసీ ఆమె కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత ఇది జరిగింది.
 
మరోవైపు, కంగనాకు, మహారాష్ట్ర సర్కార్‌కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసును తొలుత విచారించిన ముంబై పోలీసులపై నమ్మకం లేదని, ఆ నగరం పీవోకేలా మారిందన్న కంగన చేసిన వ్యాఖ్యలు శివసేనకు కోపం తెప్పించాయి. ఫలితంగానే ఈ వివాదమంతా చెలరేగింది.