శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2024 (14:26 IST)

నీట్‌లో అర్హత రాదనే మనస్తాపం.. ఐదో అంతస్థు నుంచి దూకేసిన యువకుడు

suicide
పరీక్షల ఒత్తిడి కారణంగా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మరికొద్ది రోజుల్లో జరగనున్న నీట్ పరీక్షలో అర్హత రాదనే మనస్తాపంతో విద్యార్థి భవనం ఐదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన పేట్‌బషీరాబాద్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జీడిమెట్ల స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ చంద్రోదయ రెసిడెన్సీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరవింద్ జైస్వాల్, మీన్ దంపాడు దంపతులు నివసిస్తున్నారు. దంపతులు స్థానికంగా గార్మెంట్స్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 
 
వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పీయూష్ జైస్వాల్ (22) గతంలో రెండుసార్లు నీట్ పరీక్షలో అర్హత సాధించలేకపోయాడు. ఈ ఏడాది జరగనున్న నీట్ పరీక్ష రాసేందుకు మరోసారి సిద్ధమవుతున్నాడు. నీట్ పరీక్ష మే 5న జరగనుంది. 
 
ఇప్పటికే నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న పీయూష్ ఈసారి కూడా నీట్‌లో అర్హత సాధించకపోవచ్చని ఆందోళన చెందాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన అతడు శనివారం రాత్రి 11 గంటల వరకు ఇంట్లో కుటుంబ సభ్యులందరితో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించాడు. 
 
అనంతరం రాత్రి 11.30 గంటల సమయంలో కోచింగ్ తీసుకుంటున్న తోటి విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో నీట్ పరీక్ష రాలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సందేశం పెట్టాడు. అది చూసి వెంటనే అర్ధరాత్రి 1.35 గంటలకు పీయూష్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. 
 
అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. తల్లిదండ్రులు బయటకు వచ్చేసరికి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి రక్తపు మడుగులో కొడుకు శవమై కనిపించాడు. పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక తన నిర్ణయానికి తల్లిదండ్రులను క్షమించాలని సూసైడ్ నోట్ కూడా రాశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.