గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (14:14 IST)

ఎట్టకేలకు ఢిల్లీలో భూకంపం వచ్చింది.. రాహుల్‌పై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు పేరుతో ప్రధాని మోడీ భారీ అవినీతికి పాల్పడ్డారనీ, ఈ విషయంపై తాను నోర

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు పేరుతో ప్రధాని మోడీ భారీ అవినీతికి పాల్పడ్డారనీ, ఈ విషయంపై తాను నోరు విప్పితే సభలో భూకంపం వస్తుందంటూ రాహుల్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. 
 
మంగళవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం రాష్ట్రపతి ప్రసంగంపై కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రధాని పార్లమెంటులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''ఎట్టకేలకు నిన్న భూకంపం వచ్చింది. ఎన్నో రోజుల నుంచి మాకు దీనిపై బెదిరింపులు వస్తూనే ఉన్నాయి'' అని వ్యాఖ్యానించారు. 
 
సోమవారం ఉత్తర‌ప్రదేశ్ సహా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలపై మోడీ స్పందించారు. 'ఇదిగో ఎట్టకేలకు భూకంపం వచ్చేసింది' అంటూ రాహుల్ గాంధీపై పరోక్షంగా చలోక్తి విసిరారు. ప్రజలకు అందిస్తున్న సేవలను గానీ, మంచి పనులను గానీ ఎవరైనా స్కామ్ అని పిలుస్తారా అని ప్రశ్నించారు.
 
తన ప్రభుత్వ లక్ష్యం అవినీతిపై పోరాడటమేనని మోడీ స్పష్టంచేశారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 17 మంత్రిత్వ శాఖలకు చెందిన 84 పథకాలను అనుసంధానం చేసినట్లు తెలిపారు. దీనివల్ల అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. మధ్యవర్తులు లబ్ధి పొందడం సాధ్యం కాదని వివరించారు. 
 
లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల గురించి సూచన చేశారు. ఈ రెండు సభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం గురించి ఆలోచించవలసిన సమయం వచ్చిందన్నారు. దీనివల్ల అందరికీ సమస్యలు ఎదురవుతాయని తనకు తెలుసునని, అయినప్పటికీ.. ముందుకు సాగక తప్పదన్నారు.