ఉచిత పథకాలు.. ప్రతిపక్షాల వైఫల్యాలే జయలలితను అందలమెక్కించాయి!
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శాసనసభ ఎన్నికల్లో చరిత్రను తిరగరాశారు. ముఖ్యంగా... ఎన్నికల కోసం ఆమె విడుదల చేసిన మేనిఫెస్టోలో అనేక ఉచిత పథకాలను ప్రకటించడంతో పాటు.. విపక్షాలను చిత్తు చేసేలా ఆమె రచించిన వ్యూహాలు విజయతీరాలకు చేర్చాయని ఘంటాపథంగా చెప్పొచ్చు.
ఈ ఎన్నికల కోసం ప్రతిపక్షాలన్నీ కూటములు కట్టి మరీ బరిలోకి దిగినా.. ఒంటరిగా పోటీ చేసిన అన్నాడీఎంకే వైపే తమిళ ఓటర్లు మొగ్గు చూపారు. తద్వారా జయలలితను తన రాజకీయ గురువు ఎంజీఆర్ సరసన నిలిపారు. తమిళనాట ఎంజీఆర్ తర్వాత ఇప్పటి వరకూ ఏ పార్టీ వరుసగా రెండోమారు అధికారం చేపట్టింది లేదు. ఇప్పుడు జయలలిత ఆ రికార్డును సాధించారు. ఇందుకు కారణం.. ఉచిత పథకాలు, మహిళలను గంపగుత్తగా ఆకర్షించడంతోపాటు ప్రతిపక్షాల ఎత్తులను సమర్థవంతంగా తుత్తుతునియలు చేయడమే.
2011 ఎన్నికల మేనిఫెస్టోలో గొర్రెలు, బర్రెలు, ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు వంటి ఉచితాలతో హోరెత్తించిన జయ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తు.చ తప్పకుండా పంపిణీ చేశారు. అలాగే, ఈసారి అధికారం ఇస్తే రేషన కార్డు దారులందరికీ సెల్‌ఫోన్లు, 100 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, మహిళలకు మోపెడ్, స్కూటర్ల కొనుగోలుకు 50 శాతం రాయితీ, ఉద్యోగులకు రూ.40 లక్షల వరకూ ఇంటి రుణం, సంక్రాంతి పండుగకు రేషన్ కార్డుదారులందరికీ రూ.500 గిఫ్ట్ కూపన్లు వంటివి అందజేస్తామని ప్రకటించారు. వీటిని ప్రజలు గట్టిగా విశ్వసించారు. ఫలితంగానే ఆమెను మరోమారు అందలమెక్కించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.