తినే దానికంటే ఎక్కువ వడ్డిస్తే వదిలేయమా? మోదీకి కొత్త పాఠం
మూడు పూటలా మంచి తిండి తినే భాగ్యం ఈ దేశంలో కోట్లమందికి లేదు. కాని డబ్బున్నవాళ్లు, ఇంట్లో కాకుండా ఆహారం డబ్బులు పెట్టి కొనుక్కుని తినేవారు తాము తినగా మిగిలినది ప్లేట్లో వదిలేసి పోవడం, ఆ తర్వాత దాన్ని చెత్తకుండీలో చేర్చి డంప్ యార్డ్ తరలించడం. కొన్ని కో
మూడు పూటలా మంచి తిండి తినే భాగ్యం ఈ దేశంలో కోట్లమందికి లేదు. కాని డబ్బున్నవాళ్లు, ఇంట్లో కాకుండా ఆహారం డబ్బులు పెట్టి కొనుక్కుని తినేవారు తాము తినగా మిగిలినది ప్లేట్లో వదిలేసి పోవడం, ఆ తర్వాత దాన్ని చెత్తకుండీలో చేర్చి డంప్ యార్డ్ తరలించడం. కొన్ని కోట్లమందికి సరైన తిండి దొరకని దేశంలో దుబారా వల్ల దేశం కోల్పోతున్న ఆహారం కోన్ని కోట్లరూపాయల విలువ చేస్తుంది. దుబారా చేసే ఉద్దేశం మనకు లేకున్నా డబ్బు పెట్టి కొనుక్కున్న ఆహారం మన సొంతం అనే ఆలోచనతో తినగలిగినంత తిని ఆపై పారేస్తుంటాం. వదిలేస్తుంటాం. ఇకపై ఆహారం పట్ల ఈ విధమైన నిర్లక్ష్యాన్ని సహించబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది.
దేశ చరిత్రలో తొలిసారిగా ఆహార వృథాను అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది కేంద్రం. ఇందులో భాగంగానే రెస్టారెంట్‌లు, హోటళ్లకు ఓ కొత్త ప్రశ్నావళిని రూపొందించే పనిలో పడింది. దీనంతటికీ కారణం ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్ కార్యక్రమమేమరి. మీరు వడ్డించే పళ్లెంలో ఎన్ని చికెన్ ముక్కలు పెడుతున్నారు అందులో ఎన్ని ముక్కలను కస్టమర్లు తింటున్నారు రొయ్యల వేపుడులో కస్టమర్ రెండు ముక్కలే తినగలిగితే మీరు ఆరెందుకు సర్వ్ చేస్తున్నారు? మిగతా నాలుగు ముక్కలు ఏం చేస్తారు? వృథా అయినట్లేగా. ఇలాంటి ప్రశ్నలు ఇకపై హోటళ్లను వెంటాడనున్నాయి.
‘మా తప్పేముంది మోదీజీ, మేం తినేదానికంటే చాలా ఎక్కువగా వడ్డిస్తున్నారు. అందువల్లే మేం తినలేక వదిలేస్తున్నాం. అలా అని మేం ఆహారాన్ని వృథా చేస్తున్నామని అనుకోకండి’ అని చాలా మంది తనతో షేర్ చేసుకున్నారని మోదీ ఇటీవలి మన్‌కీబాత్ ప్రసంగ కార్యక్రమంలో అన్నారు. దీంతో మోదీ ప్రసంగాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్‌విలాస్ పాసవన్.. వృథాను అరికట్టే చర్యలు చేపట్టారు.
కస్టమర్ అవసరమైన దానికంటే ఎక్కువగా ఆర్డర్ చేస్తే ఏం చేయలేం కానీ.. వాళ్లు తినేంత సర్వ్ చేయలేమా అని హోటళ్లు, రెస్టారెంట్లను ప్రశ్నించారు. కొన్ని రెస్టారెంట్లలో చాలా ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని వడ్డించడం తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకే అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో ఒకేలా సర్వ్ చేసేలా, అది కూడా కస్టమర్ పూర్తిగా తినగలిగేంత ఉండేలా చూస్తామన్నారు. ఈ మేరకు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
రెస్టారెంట్లలో ఏయే పదార్థాలు ఎంతెంత వడ్డిస్తున్నారో ఓ ప్రశ్నావళిని రూపొందిస్తామన్నారు. దీనిపై ఆహార నిపుణులతో చర్చించి.. సగటున ఓ కస్టమర్ ఏ ఆహారాన్ని ఎంత తినగలడో బేరీజు వేస్తామని పాసవన్ చెప్పారు. ఆ తర్వాత కొత్త నియమాలతో చట్టంలో సవరణలు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ కొత్త ఆలోచనలతో ఆహార వృథాను నిజంగా అరికట్టగలిగితే దేశానికి ఆ మేరకు మంచి జరిగినట్లే కదా.