1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 9 ఆగస్టు 2021 (10:14 IST)

మందకృష్ణ మాదిగ కాలుకు ఫ్రాక్చర్, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఫాలో అప్

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గాయ‌ప‌డ్డారు. ఢిల్లీలోని ఓ వెస్టిన్ కోర్ట్ హోటల్‌లో బాత్‌రూమ్‌లో ఆయన జారిపడ్డారు. ఆయనకు తలతో పాటు పలు చోట్ల గాయాలు అయ్యాయి. దీనితో ప్రస్తుతం మందకృష్ణ మాదిగ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి  హోటల్‌ వద్దకు వెళ్లి ఆయ‌న్ని ప‌రామ‌ర్శిచారు. అనంతరం ఆయన‌ని ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో మందకృష్ణ మాదిగ వైద్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.  ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయనని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. 
 
తెలంగాణ రాజకీయాల్లో మందకృష్ణ మాదిగ మ‌రోమారు కీల‌క పాత్ర పోషించ‌నున్నార‌ని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై ఆయ‌న తనదైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు. దళితులకు రూ.10 లక్షలు ఇవ్వడం మంచి విషయమే అయినా, అది వారిపై ప్రేమతో తీసుకొచ్చిన పథకం కాదని ఆయన విమర్శించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ పథకాన్ని తెచ్చారని అన్నారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మందకృష్ణ మాదిగ పోటీ చేస్తారని తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టేందుకు మందకృష్ణ మాదిగను మహాజన సోషలిస్ట్ పార్టీ తరపున పోటీ చేయించేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మందకృష్ణను కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.