శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (15:10 IST)

ఉచిత అపరిమిత కాల్స్, డేటా ఇవ్వండి: సుప్రీంలో పిటిషన్

దేశంలో లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, దీనిని తగ్గించేందుకు ప్రజలందరికీ ఉచిత అపరిమిత కాల్స్, డేటా సౌకర్యంతోపాటు డీటీహెచ్ సేవలు అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 
 
లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉంటున్న వారు, క్వారంటైన్‌లో ఉంటున్న వారు మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖను కూడా ఆదేశించాలని పిటిషన్‌దారు కోరారు. 
 
లాక్‌డౌన్ అమల్లో ఉండే మే 3వ తేదీ వరకు అన్ని చానళ్లను అపరమితంగా వీక్షించే సదుపాయం కల్పించేలా చూడాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం, టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్)లను ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు. 
 
లాక్‌డౌన్ సమయంలో వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు అనుగుణంగా చట్ట నిబంధనల ప్రకారం అధికారాలను వినియోగించుకునేలా సూచించాలని పిటిషన్‌దారు కోరారు. ఈ మేరకు మనోహర్ ప్రతాప్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.