గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2023 (15:47 IST)

ఇకపై ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్... గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

truck ac cabin
టక్కుల్లో ఏసీ క్యాబిన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2025 అక్టోబరు నెల ఒకటో తేదీ తర్వాత తయారు చేయబోయే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్‌ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్‌2, ఎన్‌3 కేటగిరీ పరిధిలోకి వచ్చే ట్రక్కులకు దీన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
సరకుల రవాణాకు ఉపయోగించే ట్రక్కుల స్థూల బరువు 3.5 టన్నుల నుంచి 12 టన్నుల వరకు ఉంటే అవి ఎన్‌2 కేటగిరీ కిందకు వస్తాయి. 12 టన్నులు దాటితే ఆ ట్రక్కును ఎన్‌3గా వర్గీకరిస్తారు. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌కు ఆమోదం లభించినట్లు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ జులైలోనే వెల్లడించారు. 
 
ట్రక్కు డ్రైవర్లకు మెరుగైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ కొత్త నిబంధన తీసుకొస్తున్నామని తెలిపారు. తద్వారా వారి పని సామర్థ్యం పెరుగుతుందన్నారు. వేడి వాతావరణంలో పనిచేసే వారికి ఇకపై అలసట నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. 
 
దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన రవాణా రంగంలో ట్రక్కు డ్రైవర్లది చాలా కీలక పాత్ర అని కొనియాడారు. వారి సమస్యల్ని పరిష్కరించడం చాలా ముఖ్యమైన అంశమన్నారు. పని వాతావరణాన్ని మెరుగుపర్చడం వల్ల వారి మానసిక స్థితి కూడా బాగుంటుందన్నారు. 
 
తెలంగాణాలో 15 రోజులు ముందుగానే ఇంటర్ పరీక్షలు  
 
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే యేడాది నిర్ణీత షెడ్యూల్ కంటే 15 రోజులు ముందుగానే ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. సాధారణంగా ప్రతి యేటా ఇంటర్ పరీక్షలు మార్చి నెల మూడో వారం నుంచి నిర్వహిస్తుంటారు. అయితే, వచ్చే యేడాది మాత్రం అందుకు భిన్నంగా మార్చి మొదటి వారంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలకు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనికితోడు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. ఇంటర్ పరీక్షలను ముందుగానే నిర్వహించడం వల్ల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధం కావడానికి సమయం ఉంటుంది. 
 
ఇంటర్ పరీక్షలు ముగిశాక అదే నెల 12న లేదంటే 14 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. అలాగే, ఫిబ్రవరి 26 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇవన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మార్చి 1 నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తం అవుతోంది. దామోదర రాజనరసింహ శనివారమే విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అనుమతి తర్వాత పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.